Delhi Metro : దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల గోడలపై ప్రొ ఖలిస్థానీ నినాదాలు దర్శనమిచ్చాయి. రెండు మెట్రో స్టేషన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలు రాశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్లలో నినాదాలను గుర్తించిన పోలీసులు.. అక్కడి సీసీ ఫుటేజ్‌ను సేకరించి నిందితులను గుర్తించే పనిలోపడ్డారు.
నిందితులు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా, ప్రధాని వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఖలిస్థానీ అనుకూల నినాదాలు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో కూడా ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు రాశారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు పంజాబ్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.