న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. రాత్రి భోజనం తర్వాత సోదరుడితో కలిసి ఐస్‌క్రీమ్ తినేందుకు బయటికి వెళ్లిన ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అడ్డుకోబోయిన అతని సోదరుడి చేతులపై కూడా కత్తిగాట్లు పడ్డాయి. చిన్న విషయానికే వారి పక్కన ఇంట్లో ఉండే మరో యువకుడు వారిపై కత్తితో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని బ్రిజ్‌పురి ఏరియాలోగల శిబ్బన్ స్కూల్ సమీపంలో సోను (19), రాహుల్ (20) తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల పిల్లలు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం తర్వాత 10 గంటలకు సోదరులిద్దరూ ఐస్‌క్రీమ్ కోసం బయటికి వెళ్లారు. ఆ సమయంలో వారి పక్కింట్లో ఉండే మహ్మద్ జైద్ (20) వారికి తారసపడ్డాడు.
ఈ సందర్భంగా రాహుల్‌కు, మహ్మద్ జైద్‌కు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన జైద్ తన దగ్గరున్న కత్తి తీసి రాహుల్ పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన సోనూ చేతులపైనా కత్తిగాట్లు పడ్డాయి. అనంతరం జైద్ అక్కడి నుంచి పారిపోయాడు. రాహుల్, సోనూలను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మధ్య చిన్న విషయానికి గొడవ జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.