CM Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు గురువారం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీతో పాటు.. సీఎం తరఫున వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి నియాబిందు తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని బుధవారం కోర్టు జూలై 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అంతకుముందు జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీని పొడిగించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత మరికొద్ది రోజులు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన మళ్లీ జూన్ 2న జైలులో లొంగిపోయిన విషయం తెలిసిందే.