న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య మరో వివాదం తలెత్తింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ్‌పూర్ పర్యటన అనుమతిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిరాకరించారు. ఆగస్ట్ 1న సింగపూర్‌లో జరిగేది మేయర్ల సదస్సు అని, పట్టణ పాలనలోని వివిధ అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎంసీడీ, డీడీఏ, ఎన్డీఎంసీ వంటి సంస్థల పరిధిలోకి ఢిల్లీ ప్రభుత్వం రాదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు సంబంధించిన అంశాల సదస్సులో సీఎం పాల్గొనడం సబబు కాదని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో సీఎం పాల్గొంటే చెడ్డ ఉదాహరణకు కారణమవుతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ టూర్‌కు వెళ్లవద్దని కేజ్రీవాల్‌కు ఎల్జీ సూచించారు. ఈ మేరకు కేజ్రీవాల్ సింగపూర్ టూర్ అనుమతి ప్రతిపాదనను ఆయన వెనక్కి పంపారు.
కాగా, సింగపూర్ టూర్‌కు ఎల్జీ అనుమతించకపోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘గౌరవనీయులైన లెఫ్టినెంట్ గవర్నర్ సలహాను నేను విభేదిస్తున్నాను’ అని లేఖలో బదులిచ్చారు. దేశంలోని ప్రతి రాజ్యాంగ అధికారి పర్యటనను ఆ అధికార పరిధిలోని అంశాల ఆధారంగా నిర్ణయించడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రధాని కూడా తన అధికార పరిధిలో లేని రాష్ట్రాల అంశాలను విదేశీ టూర్లలో చర్చిస్తారని, అలాంటప్పుడు ప్రధాని కూడా ఎక్కడికీ వెళ్లలేరని అందులో పేర్కొన్నారు.
మరోవైపు సింగపూర్ సదస్సుకు వెళ్లడంపై ముందుకు సాగాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. దీని కోసం నేరుగా విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచ నగరాల సదస్సుకు సింగపూర్ ప్రభుత్వం తనను ప్రత్యేకంగా ఆహ్వానించిందని కేజ్రీవాల్ తెలిపారు. ‘నేను నేరస్తుడ్ని కాదు, ప్రజలు ఎన్నుకున్న సీఎంని’ అంటూ కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. టూర్ అనుమతి కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్నట్లు గత ఆదివారం ప్రధాని మోదీకి కూడా కేజ్రీవాల్ లేఖ రాశారు.