Delhi LG orders | ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆప్‌ను ఇరుకున పెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారంటూ కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎల్జీ వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలు ఆప్‌ను ఇరుకునపెట్టనున్నాయి.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇందుకోసం పార్టీకి 15 రోజుల సమయం ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన రాజకీయ ప్రకటనలను ప్రభుత్వ ప్రకటనలుగా ప్రచురించారని ఎల్జీ తెలిపారు.
ప్రభుత్వ ప్రకటనల కోసం వెచ్చించిన మొత్తంపై విచారణ జరిపేందుకు 2016 ఆగస్టులో హైకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 2016 సెప్టెంబర్ 16న సమర్పించింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీని దోషిగా తేల్చింది. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ కోసం వాడుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2022 జూన్ నెలలో ఆప్ ప్రభుత్వం ఒక నెలలోనే ప్రకటనల కోసం రూ.24 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతిపక్షం పేర్కొన్నది. రాష్ట్ర ఖజానాను నింపుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్.. దానిని ఖాళీ చేసే పనిలో నిమగ్నమైందని విపక్షాలు దుయ్యబట్టాయి.