న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పరిపాలనా పరంగా విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ సంతకం లేని సుమారు 45కుపైగా ఫైళ్లను ఎల్జీ కార్యాలయం తిప్పి పంపినట్లు తెలిసింది. విద్య, వక్ఫ్ బోర్డుతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన ఫైళ్లు ఇందులో ఉన్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన 45కుపైగా ఫైళ్లపై ఆయన సంతకం లేదు. వీటిపై సీఎం కార్యాలయం అధికారుల సంతకాలున్నాయి. అలాగే ‘సీఎం చూశారు’, ‘సీఎం చూసి ఆమోదించారు’ అని ఆ ఫైళ్లపై పేర్కొన్నారు.
కాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతకం చేయకుండా ఫైళ్లను పంపుతుండటంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించాలని సీఎం కేజ్రీవాల్‌కు సూచించారు. సమర్ధవంతమైన పాలన కోసం ప్రతి ఫైల్‌పై సంతకం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉన్న ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. తద్వారా ఫైళ్లు పంపేందుకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌కు పంపిన నోట్లో ఎల్జీ సక్సేనా పేర్కొన్నారు.