న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ పురపాలక సంఘం(ఎంసీడీ)లో నామినేటెడ్ పోస్టులకు వ్యక్తులను నియమించే అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్(Delhi Lieutenant Governor)కు ఉన్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఎంసీడీకి వ్యక్తులను నియమించే అధికారం చట్టబద్దమైందని, పార్లమెంట్ ద్వారా ఆ చట్టాన్ని తయారు చేశారని, అది ఎగ్జిక్యూటివ్ పవర్ కాదు అని కోర్టు చెప్పింది.
సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తన స్వంత అధికారాలతో నిర్ణయాలు తీసుకోవచ్చు అని కోర్టు తెలిపింది. సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి సలహాల ప్రకారం ఎల్జీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న అంశంలో ఎల్జీ, ఢిల్లీ సర్కారు మధ్య తరుచూ వివాదాలు ఉత్పన్నం అవుతున్నాయి.
1957 నాటి డీఎంసీ చట్టంలోని సెక్షన్3(3)(బీ)(1) ప్రకారం.. ఢిల్లీ పురపాలక సంఘానికి పది మందిని నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది. పార్లమెంట్లో రూపొందించిన చట్టం ద్వారానే ఎంసీడీలో ఆల్డర్మెన్ను నియమించే అధికారం ఎల్జీకి ఉన్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును 15 నెలలుగా రిజర్వ్‌లో ఉంచింది. దీన్ని ఇవాళ వెలువరించారు.
ఎంసీడీలో మొత్తం 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు ఉంటారు. పది మందిని మాత్రం ఎల్జీ నామినేట్ చేస్తారు.