Delhi judge : దేశ రాజధాని ఢిల్లీలో యువ జడ్జి అనుమానాస్పదంగా మరణించాడు. మృతుడిని అమన్ కుమార్ శర్మ (30)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సౌత్ ఢిల్లీ, సఫ్దార్‌గంజ్, గ్రీన్ పార్క్‌లో నివాసం ఉండే అమన్ కుమార్ శర్మ, ఢిల్లీ పరిధిలోని కర్కర్దూమా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నాడు.
ఆయన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ హోదాలో ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడి బార్ అసోసియేషన్ కూడా ధృవీకరించింది. అయితే, అమన్ కుమార్ శర్మ, శనివారం తన ఇంటి బాత్రూమ్లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని అమన్ బంధువు శివమ్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న సఫ్దార్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అమన్ కుమార్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు.
అయితే, అమన్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగని, అక్కడ సూసైడ్ లేఖ వంటిదేమీ లభించలేదు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. అతడి మరణానికి గల కారణాల్ని ప్రస్తుతానికి గుర్తించలేదని పోలీసులు అన్నారు.