న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం పక్కనపెట్టింది. ప్రధాని మోదీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వివరాలను ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తాను డిగ్రీ పాసైనట్లు ప్రధాని మోదీ ప్రకటించిన దరిమిలా 1978లో డిగ్రీ పాసైన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతినిస్తూ 2016లో సీఐసీ ఉత్తర్వు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను ఢిల్లీ యూనివర్సిటీ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా 2017 జనవరిలో కేసు విచారణ మొదటిరోజునే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తెలుసుకోవాలనే హక్కు కన్నా గోప్యతా హక్కు బలమైనదని ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.