AR Rahman : కాపీరైట్ కేసు (Copyright case) లో ప్రముఖ సంగీత దర్శకుడు (Music Director) ఏఆర్ రెహమాన్ (AR Rahman) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట లభించింది. ఈ కేసులో రెహమాన్‌కు, ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీ మేకర్స్‌కు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు 10 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రార్‌కు రూ.2 కోట్లు, పిటిషన్‌దారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీలోని ‘వీరా రాజ వీర’ పాటకు సంబంధించి కాపీరైట్ కేసు ఎదుర్కొంటున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత శాస్త్రీయ గాయకుడు ఫయాజ్ వాసిఫుద్దీన్ ఠాకూర్ 2023లో ఢిల్లీ హైకోర్టులో కాపీరైట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘వీరా రాజ వీరా’ పాట తన తండ్రి నజీర్ ఫయాజుద్దీన్ ఠాకూర్, మామ జహీరుద్దీన్ ఠాకూర్లు స్వరపరిచిన శివస్తుతి పాట నుంచి కాపీ చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ పాటను ఎక్కడా ఉపయోగించకుండా ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్‌లను ఆదేశించాలని, అలాగే కాపీరైట్ చట్టం కింద తనకు పరిహారం చెల్లించాలని ఫయాజ్ వాసిఫుద్దీన్ అభ్యర్థించారు. అదే సమయంలో రెహమాన్ తరపున కూడా కౌంటర్ దాఖలైంది. ఈ పిటిషన్లను నిశితంగా పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. తన రిజిస్ట్రార్‌కు రూ.2 కోట్లు, పిటిషనర్‌కు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇదిలావుంటే తనపై కాపీరైట్ కేసును సవాల్ చేస్తూ రెహమాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మే 23న విచారణ చేపట్టనుంది.