న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ స్కామ్ కేసు(IRCTC Scam Case)లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవీ వేసిన పిటీషన్ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో వివరణ ఇవ్వాలని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సీబీఐకి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసును మళ్లీ జనవరి 19వ తేదీన విచారించనున్నారు. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా ఇదే తరహా పిటీషన్లు దాఖలు చేశారు.
2204 నుంచి 2009 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ కుంభకోణం జరిగింది. అక్రమ రీతిలో రాంచీ, పూరి రైల్వే హోటళ్లను కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2025 అక్టోబర్ 13వ తేదీన లాలూ, రబ్రీదేవీ, తేజస్వి యాదవ్‌తో పాటు 11 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఐపీసీ, అవినీతి చట్టాల కింద కేసు బుక్ చేశారు.
రాంచీ, పూరి రైల్వే ఐఆర్సీటీసీ హోటళ్లను అక్రమ పద్ధతిలో సుజాతా హోటల్స్‌కు లీజు ఇచ్చినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొన్నది. టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకున్న లాలూ ఫ్యామిలీ కోట్ల ఖరీదైన భూమిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రబ్రీ దేవీ, తేజస్వి యాదవ్‌తో లింకున్న కంపెనీలకు భూమిని ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.