న్యూఢిల్లీ: భార్యాభర్తలు పరస్పర సమ్మతితో విడాకులను కోరినపుడు, వారిద్దరూ ఒక ఏడాదిపాటు వేర్వేరుగా జీవించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఒక సంవత్సరం వేర్వేరుగా జీవించాలని హిందూ వివాహ చట్టం సెక్షన్ 13బీ(1) పేర్కొన్నదని, ఇది సూచనప్రాయమైనదే కానీ, తప్పనిసరి కాదని వివరించింది. ఇష్టం లేని భార్యాభర్తలను అనవసరమైన వైవాహిక బంధంలో చిక్కుకుని ఉండాలని నిర్బంధించడంలో ఏమాత్రం ప్రయోజనం లేదని వ్యాఖ్యానించింది.
హిందూ వివాహ చట్టం ప్రకారం పరస్పర సమ్మతితో విడాకుల కోసం దాఖలైన పిటిషన్పై విచారణకు అనుమతించడానికి ముందు వారిద్దరూ ఒక ఏడాదిపాటు వేర్వేరుగా జీవించాలనే నిబంధనను పాటించారా? లేదా? అనే విషయాన్ని కట్టుదిట్టంగా పరిశీలించాలా? అనే ప్రశ్నపై హైకోర్టు ఈ వివరణ ఇచ్చింది.