న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) డిగ్రీ చదువు గురించి సమాచారం వెల్లడించాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకున్నది. ఆ ఆదేశాలను హైకోర్టు పక్కనపెట్టేసింది. జస్టిస్ సచిన్ దత్తా ఫిబ్రవరి 27వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. అయితే సీఐసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది. నీరజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు ఆధారంగా.. 1978లో బీఏ పరీక్షలు పాసైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేయాలని 2016, డిసెంబర్ 21వ తేదీన సీఐసీ ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఆదేశాలను తాజాగా హైకోర్టు కొట్టిపారేసింది. వర్సిటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. 1978లో ప్రధాని మోదీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇదే కేసుపై గతంలో ఢిల్లీ వర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సీఐసీ ఆదేశాలను కొట్టిపారేయాలని ఆయన కోరారు. ప్రధాని డిగ్రీ వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీ వర్సిటీకి ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన తెలిపారు. 1978లో ఢిల్లీ వర్సిటీ నుంచి మోదీ బీఏ చదవినట్లు డిగ్రీ ఉందన్నారు.