న్యూఢిల్లీ: తల్లి కడుపులోని పిండానికి దాని జీవన సామర్థ్యం ఆధారంగా హక్కులు ఉండాలని ఢిల్లీ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. చట్టబద్ధ పరిమితిని దాటిపోయిన తర్వాత గర్భ విచ్ఛిత్తి కోసం దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని చెప్పింది. గర్భస్రావానికి సంబంధించిన న్యాయంలో పిండం జీవన సామర్థ్యానికి తగిన ప్రాధాన్యం వచ్చిందని కోర్టు పేర్కొంది. తల్లి స్వాతంత్య్రానికి, పిండం హక్కులకు మధ్య సమతుల్యతను సాధించాలని కోరింది. శాసనపరమైన స్పష్టత లేనందువల్ల కేసును బట్టి తీర్పులు ఇస్తూ, ఆసక్తులు- సంఘర్షణల మధ్య సమతుల్యతను సాధించేందుకు రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది.
స్పష్టమైన శాసన నియమావళి లేనందువల్ల ఈ అంశం అపరిష్కృతంగా మిగిలిపోతున్నదని పేర్కొంది. 15 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరగడంతో గర్భవతి అయిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని వైద్యపరంగా సమాప్తి చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత కేసులో బాధితురాలు నిందితుని చేతుల్లో క్రూరత్వాన్ని అనుభవించిందని కోర్టు తెలిపింది. పిండం సజీవంగా జన్మించే అవకాశాలు ఉండటం కన్నా ఆమె మానసిక, శారీరక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.