Delhi High Court : దేశ రాజధాని ఢిల్లీలోని స్పాలు, మస్సాజ్ కేంద్రాల్లో క్రాస్ జెండర్ మస్సాజ్లపై నిషేధం విధించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ఆరోరాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని ఇప్పటికే సింగిల్ జడ్జి ధర్మాసనం సీజ్ చేసిందని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది.
స్పాలు, మస్సాజ్ కేంద్రాలకు ఢిల్లీ ప్రభుత్వం 2021 ఆగస్టు 18న జారీచేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్ దాఖలైంది. అయితే స్పాలు, మస్సాజ్ కేంద్రాలకు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల వల్ల ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలుగడం లేదని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఆ పిటిషన్ను కొట్టివేశారు. సింగిల్ జడ్జి తీర్పును ఉటంకిస్తూ తాజాగా ద్విసభ్య ధర్మాసనం కూడా పిటిషన్ను రద్దు చేసింది.
అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్పాలు, మస్సాజ్ కేంద్రాల్లో తాళం వేసిన గదుల్లో కార్యకలపాలు కొనసాగుతున్నాయని, మస్సాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతున్నదని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని చెప్పారు. కాబట్టి మస్సాజ్ కేంద్రాల్లో క్రాస్ జెండర్ మస్సాజ్లు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.