న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ నేత దుశ్యంత్ కుమార్ గౌతమ్(Dushyant Kumar Gautam)పై చేసిన సోషల్ మీడియా పోస్టులను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. 2022లో జరిగిన అంకిత భండారి మర్డర్ కేసుతో గౌతమ్‌కు లింకు ఉన్నట్లు ఆ రెండు పార్టీలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఆరోపించాయి. బీజేపీ నేత గౌతమ్ దాఖలు చేసిన నష్టపరిహారం కేసులో హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. దుశ్యంత్‌ను టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు ఎటువంటి ఆన్లైన్ కాంటెంట్ పోస్టు చేయరాదు అని జస్టిస్ మిని పుష్కరన్తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అంకిత భండారి మర్డర్ కేసులో ఓ వీఐపీ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో టీవీ నటి ఊర్మిళ సనావర్, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కమిటీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. కేసు గౌతమ్‌కు ఫేవర్‌గా ఉందని, ఒకవేళ కించపరిచే కామెంట్లు చేస్తే, అప్పుడు బీజేపీ నేతకు తీవ్ర నష్టం జరుగుతుందని జస్టిస్ పుష్కరన్ తెలిపారు. 24 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించకుంటే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తమ నియమావళి ప్రకారం ఆటోమెటిక్‌గా తొలగిస్తుందన్నారు.
2022లో 19 ఏళ్ల అంకిత భండారి అనే అమ్మాయి హత్యకు గురైంది. పౌరి జిల్లాలోని వనన్త్రా రిసార్టులో ఆమె రిసెప్షనిస్టుగా చేసింది. రిసార్టు ఓనర్ పులకిత్ ఆర్యతో పాటు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలు ఈ మర్డర్ కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల టీవీ నటి ఊర్మిళ సనావర్ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. మర్డర్ కేసుతో ఓ వీఐపీ లింకు ఉన్నట్లు ఆ ఆడియోలో ఆమె పేర్కొన్నది. మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ భార్యే ఊర్మిళ.
బీజేపీ నేత గౌతమ్‌కు ప్రత్యేక సర్వీసు చేయని కారణంగానే ఆ హత్య జరిగినట్లు టీవీ నటి ఊర్మిళ తన ఆడియోలో ఆరోపించింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నది.