న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని కోరింది. ‘ప్రాణం విలువైంది’ అని వ్యాఖ్యానించిన కోర్ట్ వాంగ్చుక్ ఆరోగ్యాన్ని రక్షించేందుకు సాధ్యమైన ప్రతి వైద్య ప్రయత్నాన్ని చేయాలని చెప్పింది.
వాంగ్చుక్ ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. వాంగ్చుక్ వైద్య నివేదికలన్నీ అందించాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు నిర్మాణాత్మక పద్ధతి అవసరమని ధర్మాసనం పేర్కొంది. ఆ విధమైన ఏర్పాట్లు అమలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తెలపడంతో పిటిషన్ను కోర్ట్ పరిష్కరించింది. వాంగ్చుక్ నిరాహార దీక్ష గురువారం 19వ రోజుకు చేరుకొంది.