న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ-ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) అతలాకుతలమవుతున్నది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు సఫ్తర్‌జంగ్, కశ్మీర్‌గేట్, కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సహా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గురుగ్రామ్‌కు వెళ్లే రోడ్లన్నీ నీట మునగటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ సహా, పొరుగున ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. యుమునా బజార్‌లోని పునరావాస క్యాంప్‌లోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరడంతో, బాధితులను మరో చోటకు తరలించారు. భారీ వర్షాల తాకిడితో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది విమానాలపై ప్రభావం పడింది. దాదాపు 340కిపైగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.