న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆశా కిరణ్ ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 14 మంది దివ్యాంగ పిల్లలు మరణించడంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. (Asha Kiran row) నెల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం యాదృచ్ఛికం కాదని పేర్కొంది. మురుగు పైపు లైన్లలోని నీటి నాణ్యత, నీటి పరిస్థితిని పరీక్షించాలని ఢిల్లీ జల్ బోర్డును ఆదేశించింది. జూలైలో ఆ షెల్టర్ హోమ్‌లో 14 మంది, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 25 మంది పిల్లలు చనిపోయినట్లు నివేదిక వెలువడింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇంత మంది పిల్లల మరణాలు యాదృచ్ఛికం కాదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. షెల్టర్ హోమ్‌లోని నివాసితుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.
కాగా, దివ్యాంగుల వసతి గృహంలో కొందరు టీబీతో బాధపడుతున్న కారణంగానే ఇన్ని మరణాలు సంభవించాయన్న అంశాన్ని ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది. నీటి నాణ్యతతో పాటు, మురుగు నీటి పైపులైన్ల పరిస్థితిని పరీక్షించి నివేదిక సమర్పించాలని ఢిల్లీ జల్ బోర్డును ఆదేశించింది. అలాగే షెల్టర్ హోమ్‌లో పరిమితికి మించి ఎక్కువ మంది ఉంటే రద్దీని తగ్గించాలని, కొందరిని మరోచోటకు తరలించాలని అధికారులకు హైకోర్టు సూచించింది.