Justice Yashwant Varma | న్యూఢిల్లీ, మార్చి 21 : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు కలకలం రేపాయి. జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పే సందర్భంగా భారీ స్థాయిలో కరెన్సీ కట్టలు కనిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు ఢిల్లీ హైకోర్టులో ప్రస్తావించడంతో ప్రధాన న్యాయమూర్తి సైతం దిగ్భ్రాంతి చెందారు. సుప్రీంకోర్టు సైతం వేగంగా స్పందించింది. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రాథమిక విచారణను చేపట్టడం కొలీజియం తీసుకున్న చర్యలలో ఒకటని, ఈ ఉదంతంపై మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జస్టిస్ వర్మ బదిలీపై కొలీజియం సిఫార్సును కేంద్రం ఆమోదించవలసి ఉంటుంది. ఆ తర్వాతే బదిలీ ఉత్తర్వులు వెలువడతాయి.
జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఇది చెత్త కుండీ కాదు’ అంటూ బార్ అసోసియేషన్ మండిపడింది. జస్టిస్ వర్మ బదిలీ వార్తలు వెలువడిన వెంటనే తమ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అనిల్ తివారీ అధ్యక్షతన సమావేశమైన బార్ అసోసియేషన్ జస్టిస్ వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపాలన్న కొలీజియం నిర్ణయం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తివారీ ఓ ప్రకటనలో తెలిపారు. జస్టిస్ వర్మ నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ. 15 కోట్లు దొరికినట్టు తమకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. కొలీజియం తీసుకున్న నిర్ణయంతో అలహాబాద్ హైకోర్టు చెత్త కుండీనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నగదు బయటపడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టడం, జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం వేర్వేరని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. జస్టిస్ వర్మ నివాసంలో నగదు బయటపడినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని సుప్రీంకోర్టు తెలియచేసింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు, అంతర్గత విచారణ ప్రక్రియకు సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. తమకు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ హైకోర్టు సీజే సాక్ష్యాలు, వివరాల సేకరణతో అంతర్గత విచారణను ప్రారంభించారని సుప్రీంకోర్టు పేర్కొంది. మార్చి 20న జరిగిన కొలీజియం సమావేశానికి ముందు అంతర్గత విచారణ ప్రారంభించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సీజేఐకి నేడే తన నివేదికను అందచేస్తారని ప్రకటన పేర్కొంది. నివేదికను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ 1992 ఆగస్టు 8న న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 13న ఆయన అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న ఆయన అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో మంటలను ఆర్పే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి నగదు ఏదీ కనిపించలేదని ఢిల్లీ అగ్నిమాపక సర్వీసుల అధిపతి అతుల్ గార్గ్ శుక్రవారం ప్రకటించారు. మార్చి 14న రాత్రి 11.35 గంటల ప్రాంతంలో జస్టిస్ వర్మ నివాసంలో మంటలు చెలరేగినట్టు కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చిందని, వెంటనే రెండు అగ్నిమాపక శకటాలు అక్కడకు వెళ్లాయని గార్గ్ తెలిపారు. మంటలను ఆర్పిన తర్వాత పోలీసులకు తమ సిబ్బంది సమాచారం అందచేసి అక్కడి నుంచి వచ్చేశారని తెలిపారు. మంటలను ఆర్పే సమయంలో తమ సిబ్బందికి ఎటువంటి నగదు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.