న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ సోమవారం తోసిపుచ్చారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కొట్టివేసిన హైకోర్టు.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే అవకాశం కల్పించింది. అరెస్టు సవాల్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు తీర్పులను వరుసగా గత నెల 17, 29న రిజర్వ్ చేసింది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈడీకి పలు ప్రశ్నలను సంధించింది. నేరానికి, విధాన నిర్ణయానికి మధ్య విభజన రేఖ ఎలా గీయాలని ఈడీని ప్రశ్నించింది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో అనుమానాలు పెరగడానికి లాభాల్లో మార్జిన్లు పెరగడమే ప్రాతిపదిక అయితే మంత్రివర్గం ఎలా పనిచేస్తుందని జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిచట్టబద్ధమైన విధాన నిర్ణయాలు, నేర చర్యల మధ్య తేడాను ఎలా చూపుతుందని ప్రశ్నించింది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న, లేదా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉండాలనే చర్య ఇతరులకు అసమాన లాభాలకు దారితీస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యులను నామినేట్ చేసే విషయంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ మంత్రిమండలి సలహాలను పాటించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఎంసీడీలో 10 మంది సభ్యులను ఢిల్లీ మంత్రి మండలి సలహా తీసుకోకుండా ఏకపక్షంగా నియమిస్తూ ఢిల్లీ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసు వాదోపవాదాలు పూర్తయిన 15 నెలల అనంతరం సోమవారం తీర్పు వెలువరించింది. 1993లో సవరించిన ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంసీడీలో సభ్యులను నియమించవచ్చునని, దీనికి ప్రభుత్వ అనుమతి, సలహా అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.