న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పేద ప్రజల ఇండ్లు జలమయమయ్యాయి. దీంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. వరద ప్రభావిత కుటుంబాలకు పది వేల చొప్పున చెల్లిస్తామని ఆదివారం ప్రకటించారు. ‘యమునా నది సమీపంలో నివసిస్తున్న అనేక పేద కుటుంబాలు భారీ నష్టాన్ని చవి చూశాయి. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలోని అన్ని వస్తువులను కోల్పోయాయి. ఆర్థిక సహాయంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.10,000 పరిహారం అందజేస్తాం’ అని ట్వీట్ చేశారు.
కాగా, వరదల వల్ల ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకు వాటిని అందజేస్తామని చెప్పారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం పాఠశాలల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో ఆహారం కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. మోరీ గేట్‌లోని ఒక స్కూల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించినట్లు మరో ట్వీట్లో పేర్కొన్నారు.