న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తటంతో అత్యవసరంగా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలుపలేదు. ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఫ్లైట్ నంబర్ ‘6ఈ-6271’లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇండిగో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
దీంతో ఆ విమానాన్ని హఠాత్తుగా ముంబైకి దారిమళ్లించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, లక్నో నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంతో విమాన సర్వీస్‌ను అధికారులు రద్దు చేశారు. లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే, బుధవారం ముంబై నుంచి దుబాయ్ బయల్దేరిన ఎమిరేట్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మూడు గంటలు ఆలస్యమైంది.