న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఢిల్లీలో నిర్భయ తరహా అత్యాచార ఘటన మరొకటి చోటు చేసుకొన్నది! ఒక స్లీపర్ బస్ డ్రైవర్, కండక్టర్ కదులుతున్న బస్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని.. నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జరిగిన బస్కు ఎలాంటి కిటికీలు, అత్యవసర నిష్క్రమణ ఏర్పాట్లు లేవు. వివాహిత అయిన బాధితురాలు ఓ ఫ్యాక్టరీలో డ్యూటీ ముగిశాక వసంత విహార్ బి-బ్లాక్ బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్ వద్దకు వచ్చింది.
అక్కడ నిలబడిన ఓ వ్యక్తిని సమయం ఎంతైందని అడిగింది. అయితే అతడు సమాధానం చెప్పకుండా ఆమెను బస్ లోపలకు లాక్కెళ్లాడు. ఆ తర్వాత డ్రైవర్ వెంటనే ఆ బస్ను నాంగ్లోయి దిశగా మళ్లించాడు. ఏడు కిలోమీట్ల దూరం బస్ ప్రయాణించింది. ఆ సమయంలో డ్రైవర్, హెల్పర్ మహిళపై అత్యాచారం చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆమెను కిందకు తోసేసి వెళ్లిపోయారు.