న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 18న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుంది. 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.
ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మికిపూర్, తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం ఇదే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అసెంబ్లీ షెడ్యూల్ విడుదల కావడంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాగా, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్ స్థానాలు, మరో 12 రిజర్వ్డ్ స్థానాలు. ఇక్కడ మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 13 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈవీఎంలలో చెల్లని ఓట్లకు, రిగ్గింగ్, ట్యాంపరింగ్‌కు అవకాశమే ఉండదని, ఇదే విషయాన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులు 42 సార్లు స్పష్టం చేశాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికి 67 వేల వీవీప్యాట్లలోని 4.5 కోట్ల స్లిప్పులను లెక్కించగా, ఒక్క ఓటు కూడా తేడా రాలేదని అన్నారు. కాగా, ఢిల్లీలో ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో త్వరలో ఓటర్ల సంఖ్య వంద కోట్లు దాటి కొత్త రికార్డును సృష్టించబోతున్నదని రాజీవ్ కుమార్ తెలిపారు.
సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ తర్వాత తాను నాలుగైదు నెలల పాటు హిమాలయాల్లో గడుపుతానని ఆయన చెప్పారు. హిమాలయాల్లో ఏకాంతంగా ఉంటానని, తనను తాను చదువుకుంటానని ఆయన పేర్కొన్నారు. తాను చెట్టు కింద చదువుకున్నానని, తనలాంటి పిల్లలకు చదువు చెప్తానని తెలిపారు.