న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించి, ఆ తర్వాత అరెస్టు చేసింది. సోమవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణలో పలు కీలక అంశాలకు సంబంధించి ఆయన చెప్పిన సమాధానాల్లో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని అధికారులు చెప్తున్నారు. కాగా, అంతకుముందు సిసోడియా సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను పెంచారు. సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీబీఐ ఆఫీసుతో పాటు సిసోడియా నివాసం వద్ద స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను మోహరించారు. సిసోడియా అరెస్టును పలు పార్టీలు ఖండించాయి.
తగిన సమయంలో సమాధానం
సిసోడియా అరెస్టుపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. సిసోడియా అమాయకుడని, ఆయన్ను అరెస్టు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శమని అన్నారు. ఈ పరిణామాలను ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నదని, సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తారని బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు. సిసోడియా అరెస్టు తమను ఎంత మాత్రం బలహీనం చేయదని, తమ పోరాటం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
జైల్లో ఉండాల్సి వచ్చినా లెక్కచేయను
సిసోడియా సీబీఐ విచారణకు బయలుదేరే సమయానికి ఆయన ఇంటి వద్దకు ఆప్ కార్యకర్తలు భారీగా చేరుకొన్నారు. రోడ్‌షోగా వెళ్లి రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన అరెస్టును ముందుగానే ఊహించిన ఆయన.. మరో 7-8 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా లెక్కచేయనని, తాను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తినని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే తనను తప్పుడు కేసులో ఇరికించారని విమర్శించారు. అధైర్యపడొద్దని కార్యకర్తలకు సూచించిన సిసోడియా.. తన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతూ బీజేపీ దొంగచాటు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో అక్కడి అధికార పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్టు అని విమర్శించారు. ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టుగా మారాయని అన్నారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్టు పరాకాష్టగా అభివర్ణించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికలో సుప్రీం కోర్టు ద్వారా చీవాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ అసమర్థ విధానాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలు, నాయకులను ఎదుర్కోలేక ఆ పార్టీ పిరికి రాజకీయాలు చేస్తున్నదన్నారు. తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుడి సహోదరులుగా చూపించి, ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చిత్రీకరించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నీతి లేని దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు తిప్పికొడ్తారని తెలిపారు. భవిష్యత్తులో కమలం పార్టీ నాయకులకూ ఇదే గతి పడుతుందని వెల్లడించారు. బీజేపీ అప్రజాస్వామిక కుట్రలకు కాలం దగ్గరపడిందని హెచ్చరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఆప్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ.. ఆ ఓటమి నుంచి దృష్టిమళ్లించేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ చూసిందని, మేయర్ ఎన్నిక సందర్భంగానూ నీచంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిన తీరును దేశమంతా చూసిందని అన్నారు. ఈ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్నదని హరీశ్ రావు గుర్తు చేశారు. ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని, అందుకే సిసోడియాను లిక్కర్ స్కాంలో ఇరికించి అరెస్టు చేసిందని వెల్లడించారు. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని, ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో రాబోతున్నాయని పేర్కొన్నారు.