న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 27,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.22 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,445కు చేరింది. ఇందులో 56,991 మంది హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,17,716కు పెరిగింది.
మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 40 మంది కరోనాతో మరణించారు. గత ఏడాది జూలై తర్వాత ఇదే గరిష్ఠ సంఖ్య. ఈ ఏడాది ఆరంభం నుంచి జనవరి 12 వరకు 133 మంది కరోనాతో చనిపోయారు. మంగళవారం 23, ఆదివారం 17 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,240కి చేరింది. గత 24 గంటల్లో 14,957 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,05,031కి చేరింది