న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వీయ నగర్‌లోని ఓ హోటల్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ హోటల్ ఓనర్ లవ్‌కేశ్ బజాజ్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ కోర్టు(Delhi Court ) ఆదేశాలు జారీ చేసింది. జుడిషియల్ మెజిస్ట్రేట్ భాను ప్రతాప్ సింగ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు అభ్యర్థించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 105(హోమిసైడ్), 326(జీ)(అగ్నిప్రమాదం), 324(5)(ప్రాపర్టీ డ్యామేజ్), 125(ఏ)(భద్రతా నిర్లక్ష్యం), 125(బీ)(తీవ్ర నిర్లక్ష్యం), 287(అగ్నిప్రమాదం వేళ నిర్లక్ష్యం) కింద కేసు బుక్ చేశారు.
ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిలో ఎక్కువ శాతం మంది విదేశీయులు ఉన్నారు. సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బంధువులే ఆ మృతుల్లో ఉన్నారు. అయితే ఏ కారణం చేత మంటలు వ్యాపించాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫ్లోరిష్ స్టే హోటల్ కోసం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కింద హోటల్ ఓనర్ బజాజ్ లైసెన్సు తీసుకున్నారు. కానీ ఆ లైసెన్సు ప్రకారం అతిథులకు కేవలం ఆరు రూమ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ ప్రాథమిక విచారణ ప్రకారం.. ఫ్లోరిష్ స్టేలో 25 రూమ్‌లు ఆపరేటింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. బేస్మింట్‌లో ఉన్న అకామిడేషన్‌ను కూడా వాడుతున్నారు.
ఆ ప్రాపర్టీకి మొత్తం ఓనర్ బజాజ్ ఒక్కడే. జై మిశ్రా అనే వ్యక్తికి మేనేజ్మెంట్ అప్పగించినట్లు ఆయన చెప్పారు. అయితే మిశ్రా కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతను పరారీలో ఉన్నాడు. బీ అండ్ బీ స్కీమ్‌ను 2007లో ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్‌లో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వసతిని ఇవ్వనున్నారు. బుధవారం జరిగిన ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, దాంట్లో 12 మంది విదేశీయులు ఉన్నారు.