న్యూఢిల్లీ, మే 10: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా అవసరమైన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. లైంగిక వేధింపులు, ఇతర ఆరోపణల్లో ఆయనపై అభియోగాల నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్ 354, 354ఏ, 506 కింద అభియోగాలు నమోదు చేయాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఆదేశించారు. ఈనెల 21న కోర్టు బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలను నమోదు చేయనున్నది. ఈ కేసులో గత ఏడాది జూన్ 15న ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పై కూడా అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. బ్రిజ్‌పై ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల్లో ఒకరి ఫిర్యాదులో ఆధారాలు లేనందున అతడిని డిశ్చార్జ్ చేసింది.
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తర్వాత వెనక్కు తీసుకున్న మైనర్ రెజ్లర్ కేసును మూసివేసేందుకు పోలీసులు కోరిన అనుమతిపై మే 20న మరో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మైనర్ రెజ్లర్ ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, అనూహ్యంగా తాను అబద్ధపు ఆరోపణలు చేశానని ఆమె తండ్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.