న్యూఢిల్లీ: 1984లో సిక్కుల ఊచకోత జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై నేరాభియోగం నమోదు చేసింది. హత్యతో పాటు ఇతర నేరాల కింద అభియోగాలు నమోదు అయ్యాయి. స్పెషల్ జడ్జి రాకేశ్ సియాల్.. ఆ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని తెలిపారు. సిక్కుల ఊచకోతకు తనకు ఎటువంటి సంబంధం లేదని టైట్లర్ వాదించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న టైట్లర్‌పై దర్యాప్తు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నట్లు ఆగస్టు 30వ తేదీన ఇచ్చిన తీర్పులో జడ్జి పేర్కొన్నారు.
1984 నవంబర్ ఒకటో తేదీన పుల్ బంగాష్ గురుద్వారా చేరుకున్న టైట్లర్.. అంబాసిడర్ కారు నుంచి దిగిన తర్వాత అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టారని, సిక్కులను చంపండి , వాళ్ల మన తల్లిని చంపారని ఆ గుంపును ఉసిగొల్పాడని ఓ ప్రత్యక్షసాక్షి చేసిన ఫిర్యాదును ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. టైట్లర్ రెచ్చగొట్టడం వల్లే ఆ రోజున ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. రెండు గ్రూపులను రెచ్చగొట్టడం, అక్రమంగా చొరబడటం, చోరీ లాంటి కేసులను కూడా నమోదు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.