లక్నో: ఒక మోసం కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యూపీ కానిస్టేబుళ్లతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ పోలీస్ బృందాన్ని అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. (Delhi Cops Detained) రూ. 1.5 కోట్ల మోసం కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చేరుకున్నారు. సాధారణ దుస్తులు ధరించి ఆయుధాలు కలిగిన పోలీస్ బృందం ప్రైవేట్ వాహనంలో వచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లలిత్పూర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్స్ విశ్వజీత్, సచిన్ అవస్థిని వారి క్వాటర్స్ నుంచి మరో నిందితుడు బిక్కీ రాజాను అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు.
కాగా, లలిత్పూర్ పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఢిల్లీ బృందాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ దర్శన్ సింగ్‌తో సహా ఆ పోలీస్ బృందాన్ని లలిత్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు, అధికారిక అనుమతి లేకుండా పోలీస్ కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేయడంపై రోజంతా విచారణ జరిపారు. చివరకు క్షమాపణలు చెప్పిన తర్వాత ఢిల్లీ పోలీస్ బృందాన్ని విడిచిపెట్టారు. ఈ మోసం కేసులో కానిస్టేబుల్స్ ప్రమేయంపై తాము దర్యాప్తు చేస్తామని యూపీ పోలీస్ అధికారి పేర్కొన్నారు.