న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ స్థానంలో పార్టీ ఎవర్ని నియమిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్ పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. .
సునీత కేజ్రీవాల్ : కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ నుంచి కీలక నేతగా తెరపైకి వచ్చారు. ఇండియా కూటమి సమావేశాల్లో వివిధ పార్టీల నాయకుల్లో ఒకరిగా నిలబడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున చురుకుగా ప్రచారం పాల్గొన్నారు.
ఆతిశీ: ఆక్స్‌ఫర్డ్‌లో మాస్టర్స్ చేశారు. ఆర్థికం, ప్రజా పనులు, విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో ప్రాథమిక విద్యను మెరుగు పర్చటంలో కీలక పాత్ర పోషించారు.
సౌరభ్ భరద్వాజ్: ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. సీఎం పదవికి బలమైన పోటీదారుగా ఆయన పేరు వినిపిస్తున్నది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు.
గోపాల్ రాయ్: పర్యావరణం, సాధారణ పరిపాలన మంత్రిగా ఉన్నారు. విద్యార్థి సంఘం మాజీ నాయకుడిగా పార్టీ వ్యవహారాల్లో గట్టి పట్టు సాధించారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రభావశీల వ్యక్తిగా కొనసాగుతున్నారు.
కైలాశ్ గెహ్లాట్: న్యాయశాఖ, ఐటీ, రెవెన్యూ, ప్లానింగ్ తదితర శాఖల మంత్రిగా ఉన్నారు. సీఎం కేజ్రీవాల్‌కు విశ్వసనీయ వ్యక్తిగా మంత్రి కైలాశ్ గెహ్లాట్‌కు పేరుంది.