పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (టీఎంసీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కలిసి కూటమిగా బరిలో దిగబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తోసిపుచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ రానిపక్షంలో బీజేపీయేతర విభాగాలతో పొత్తు కుదుర్చుకునే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పారు.
ప్రస్తుతానికైతే గోవాలో మొత్తం 40 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, త్వరలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని కేజ్రివాల్ వెల్లడించారు. అదేవిధంగా గోవా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, దివంగత మనోహర్ పారికర్‌ను ఆయన ప్రశంసించారు. అధికార బీజేపీలో ఎవరైనా ఇబ్బందిగా ఉంటున్నట్లయితే ఆప్‌లో చేరవచ్చని కేజ్రివాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. మమతాబెనర్జి తనకు అక్కలాంటిదని చెప్పానని, అంతమాత్రాన ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు.
మనోహర్ పారికర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు పొగడ్తలు గుప్పిస్తున్నారని, కానీ వాస్తవంలో ఆయన కుటుంబానికి ఏం న్యాయం చేశారని కేజ్రివాల్ నిలదీశారు. మనోహర్ పారికర్ కుమారుడు బీజేపీ టికెట్ కోసం నానా ప్రయాస పడాల్సి వచ్చిందన్నారు. అలా బీజేపీలో ఎవరైనా నిర్లక్ష్యానికి గురవుతున్నట్లయితే నిరభ్యంతరంగా వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చని కేజ్రివాల్ పిలుపునిచ్చారు.