దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులెందరో ఉండే హైసెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో జరిగిన భారీ పేలుడుతో 9మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.
మరో 24మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన విస్ఫోటంతో జనం ఎగిరిపడ్డారు. దేహాలు ఛిద్రమయ్యాయి. వాహనాలు తునాతునకలయ్యాయి. దుకాణాలు ధ్వంసమయ్యాయి. శకలాలతో క్షణాల్లోనే అది మరుభూమిగా మారింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఉగ్రదాడిగా భావిస్తున్న ఈ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అప్పుడే ఆగిన ఐ20 కారులో సాయంత్రం 6.52 గంటలకు ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్జేపీ) దవాఖానకు తరలించారు. పది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు ఢిల్లీ కమిషనర్ సతీశ్ గోల్చా తెలిపారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా ఎన్ఐఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది రంగంలోకి దిగి ఆధారాలను సేకరించినట్టు వెల్లడించారు.
పేలుడు నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలు సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతాదళాలు నిఘాను పెంచాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో భద్రతను ముమ్మరం చేశారు. ఢిల్లీ, హర్యానా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. మంగళవారం బీహార్‌లో రెండో దఫా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘాను పెంచారు.
పేలుడు ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అడిగి ప్రధాని మోదీ వివరాలు తెలుసుకొన్నారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలియజేశారు. ఎల్ఎన్జేపీ దవాఖానకు వెళ్లిన అమిత్ షా.. క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని తెలిపారు.

భారీ పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ వాతావరణం నెలకొన్నది. ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. ఒకవైపు కాలుతున్న మృతదేహాలు.. మరోవైపు తెగిపోయిన అవయవాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. పోలీసులు 9 మంది మరణించినట్టు చెబుతున్నప్పటికీ, పేలుడు తీవ్రతను దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం 40-50 మంది వరకూ మరణించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పేలుడు జరగ్గానే చాలామంది ఎగిరిపడ్డారని, పేలుడు శబ్దం వినగానే భయంతో తామందరం పరుగులు తీశామని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కారు రన్నింగ్‌లో ఉండగానే పేలుడు జరిగినట్టు ఓ ఆటో డ్రైవర్ తెలిపారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సోమవారం సెలవు కావడంతో బాధితుల సంఖ్య తగ్గిందని, లేకుంటే మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
పేలుడు సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆత్మాహుతి ఉగ్రదాడా? అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనాస్థలిలో ఓ బుల్లెట్ లభ్యమైనట్టు సమాచారం. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నంబర్, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. పేలుడు జరిగిన కారు పక్కనున్న ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా 22 వాహనాలు నాశనమయ్యాయి. సమీపంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. స్ట్రీట్ లైట్లు పగిలిపోయాయి.
పేలుడు సమాచారం అందుకొన్న 10 నిమిషాల్లో ఘటనాస్థలికి ఢిల్లీ క్రైమ్ బ్యాంచీ, ఢిల్లీ స్పెషల్ బ్రాంచీ పోలీసులు చేరుకొన్నట్టు అమిత్ షా తెలిపారు. అయితే, పేలుడు జరిగిన దాదాపు గంట తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సహాయకచర్యలు ఆలస్యంగా మొదలవ్వడంతోనే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారినట్టు తెలిపారు.

అది దేశ రాజధాని ఢిల్లీ. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులు ఎందరో ఉండే చోటు. అందునా చారిత్రక ఎర్రకోట కొలువుదీరిన హై-సెక్యూరిటీ జోన్. అలాంటి సున్నితమైన ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు జరిగింది. అసలేం జరుగుతుందో తెలుసుకొనే లోపే.. కారు పక్కనున్న జనం ఎగిరిపడ్డారు. దేహాలు ఛిద్రమయ్యాయి. వాహనాలు బూడిదయ్యాయి. సమీపంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. నిమిషం వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై క్షతగాత్రుల హాహాకారాలతో మరుభూమిగా మారిపోయింది. ఉగ్రదాడిగా భావిస్తున్న ఈ మారణహోమంలో 9 మంది మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. హర్యానాలో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటలకే ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
పేలుడు జరిగిన కారు హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. మహ్మద్ సల్మాన్ నుంచి అతడు ఈ కారును కొనుగోలు చేసినట్టు సమాచారం. గురుగ్రామ్‌లో సల్మాన్ అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ తన కారును పుల్వామాకు చెందిన తారీఖ్‌కు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం.