న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 9 మంది మృతిచెందారు. అయితే ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సూసైడ్ బాంబర్(Delhi Suicide Bomber)కు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆ దాడికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుపు రంగు హుందైయ్ ఐ20 కారులో ఉమర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబర్‌కు చెందిన ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు బయటపెట్టిన విషయం తెలిసిందే. డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో డాక్టర్ ఉమర్‌కు లింకు ఉన్నట్లు తేల్చారు. అదీల్, షకీల్‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు తెలుసుకున్న డాక్టర్ ఉమర్.. ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్నాడు.
అయితే ఆందోళనకు గురైన అతను బహుశా తన వాహనాన్ని తానే పేల్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉమర్ .. పేలుడు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కారులో డెటోనేటర్ను పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
ఎర్రకోట వద్ద హుందయ్ ఐ20 కారు సుమారు మూడు గంటల పాటు పార్కింగ్ చేసినట్లు గుర్తించారు. HR 26CE7674 వెహికల్ నెంబర్ ఉన్న ఆ కారు మధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఫోర్ట్ వద్ద పార్కింగ్‌లో ఉన్నది. అయితే ప్రాథమిక విచారణ తర్వాత ఆ కారు అమ్మకం జరిగిన వివరాలు బయటకు వచ్చాయి. పలు మార్లు దాన్ని అమ్మినట్లు గుర్తించారు.
2025 మార్చిలో సల్మాన్ అనే వ్యక్తి దేవేందర్‌కు ఆ కారును అమ్మాడు.కానీ ఆ తర్వాత అక్టోబర్ 29వ తేదీన దేవేందర్నుంచి ఆమిర్ కారును కొనుగోలు చేశాడు. ఇక ఆమిర్ నుంచి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కారు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు కేసులో ఆమిర్, తారిక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బాదర్పుర్ రోడ్డు మార్గంలో కారు వచ్చినట్లు గుర్తించారు. ఆ రూట్లో ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. పార్క్ చేసిన కారులో ఉన్న డాక్టర్ ఉమర్ కనీసం ఒక్క నిమిషం కూడా కిందకు దిగలేదు. బ్లూ, బ్లాక్ టీషర్ట్ వేసుకున్న ఉమర్.. డ్రైవర్ సీటులో ఉన్నట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది.