Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్ తర్వాత భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. ఈ సంఘటన తర్వాత అన్ని సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు నిఘా పెంచారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద ఢిల్లీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), కేంద్ర భద్రతా సంస్థలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. అదనపు సిబ్బందిని మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాజధానిలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్ వద్ద అదనపు పోలీసు దళాలను మోహరించారు.
ఏదైనా సంఘటన జరిగితే ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్ గేట్, సారాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్ ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్స్ వద్ద తనిఖీలను కఠినతరం చేశారు. పోలీసు బృందాలు నిరంతరం ప్రయాణికులను పర్యవేక్షిస్తూ వాహనాల తనిఖీని చేస్తున్నాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించడానికి బస్ టెర్మినల్స్ ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్తో పాటు, ఢిల్లీ మెట్రో స్టేషన్లలో భద్రతా సంస్థలు నిఘా వేశాయి. పుకార్లను నమ్మకూడదని.. ఏదైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, ఆనంద్ విహార్ టెర్మినల్, హజ్రత్ నిజాముద్దీన్, సారాయ్ రోహిల్లాతో సహా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), పీఆర్పీ అదనపు బృందాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ఆవరణ, ప్రవేశ ద్వారాలపై తనిఖీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగేజ్ స్కానర్లతో సోదాలు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో ఏదైనా అలసత్వాన్ని సహించబోమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అయితే, రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో వెంట గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని.. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.