న్యూఢిల్లీ, అక్టోబర్ 26: కాలుష్య కాసారంగా మారిన యమున నదిలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ అస్వస్థతకు గురయ్యారు. ఆప్‌పై నిరసనగా చేపట్టిన ‘యమునా స్నానం’ ఆయనను దవాఖాన పాలు చేసింది. ఒంటిపై దురదలు, శ్వాసలో ఇబ్బంది సమస్యలతో ఆయన శనివారం ఢిల్లీలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చేరారు. యమున నది ప్రక్షాళన విషయంలో ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఆ నది శుద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ గురువారం ఆయన యమునలో స్నానం చేశారు. స్నానం చేసిన కొద్ది సేపటికే ఆయన ఒంటిపై దద్దుర్లు రావడంతో పాటు ఊపిరి తీసుకోవడంలో స్వల్పంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన దవాఖానకు వెళ్లగా వారు మూడు రోజులకు మందులు ఇచ్చారు. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఆయన శనివారం అదే దవాఖానలో చేరారు. అయితే ఇలాంటి నాటకాలతో యమున నది ప్రక్షాళన కాదని సచ్దేవ్ తెలుసుకోవాలని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు.
యమున కాలుష్యంపై జోరుగా రాజకీయాలు
యమునా నది కాలుష్యం ఇప్పటికే బీజేపీ, ఆప్ పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల విష పూరితమైన నురగ నదీ జలాలపై పొరగా ఏర్పడటంతో అవి మరింత అధికమయ్యాయి. యమునా నది అలా కావడానికి కారణం బీజేపీయేనని, ఆ పార్టీ పాలిత యూపీ, హర్యానాల్లోని వందలాది పరిశ్రమల్లోని శుద్ధి చేయని మిలియన్ గ్యాలన్ల పారిశ్రామిక వ్యర్థాలు డ్రైన్ల ద్వారా యమునలో కలవడం వల్లే పూర్తిగా కలుషితం అయినట్టు ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.