Bomb Threat : దేశంలోని ప్రముఖులను హతమారుస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఈ అంశంపై భద్రతా సిబ్బంది, అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టారు. మంగళవారం తనకు బెదిరింపు మెయిల్ వచ్చిందని స్పీకర్ విజేందర్ గుప్తా అధికారులకు తెలిపారు. దేశంలోని ప్రముఖులను హతమారుస్తామని పేర్కొంటూ ఆ మెయిల్ వచ్చింది.
అందులో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సందు వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ అసెంబ్లీ, విధాన సభ మెట్రో స్టేషన్లకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే అసెంబ్లీ, విధాన సభ మెట్రో స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్‌తో, డిస్పోజబుల్ టీమ్స్‌తో తనిఖీలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణం, మెట్రో స్టేషన్ పరిసరాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతం మొత్తం హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. అయితే, ఇలాంటి బెదిరింపులు రావడం సహజమే అని, అలాగని వాటిని తేలిగ్గా తీసుకోలేమని, అందుకే భద్రతను కట్టుదిట్టం చేశామని ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్ అన్నారు.
ఈ బెదిరింపులపై తామేమీ భయపడటం లేదని, అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా సీఎం రేఖా గుప్తా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. బెదిరింపు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ఆరాతీస్తున్నారు.