Delhi Airport Advisory | అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఆదివారం తెల్లవారు జామున 2.42 గంటల ప్రాంతంలో ఓ అడ్వైజరీని జారీ చేశారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని.. ఎయిర్‌స్పేస్ డైనమిక్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు పెరిగిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్, విమానాల షెడ్యూల్లో సర్దుబాట్ల సందర్భంగా తనిఖీ కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్ కమ్యూనికేషన్ ఛానెల్స్‌తో టచ్‌లో ఉంటాలని.. క్యాబిన్, చెక్-ఇన్ బ్యాగేజీకి సంబంధించి సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, వీలైనంత వరకు ముందుగానే చేరుకొని భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచించింది.
ఎయిర్‌లైన్స్ లేదంటే ఢిల్లీ విమానాశ్రయం వెబ్సైట్లో విమానం స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని చెప్పింది. పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మే 15 వరకు 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో ఆదంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, బటిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ ఉత్తర్లై ఉన్నాయి.