న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ఉన్న 138 వీడియోలు, 83 ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ రెండు మీడియా సంస్థలకు, పలు యూట్యూబ్ చానళ్లకు, సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీచేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ వేసిన ఓ పరువునష్టం దావాపై విచారణ జరిపిన వాయవ్య ఢిల్లీ జిల్లా కోర్టు ఈ నెల 6న జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. పరంజోయ్ గుహ ఠాకుర్తా, రవి నాయర్, అబీర్ దాస్‌గుప్తా, అయస్కాంత్ దాస్, ఆయుష్ జోషి సహా పలువురు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలకు చెందిన వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న కొందరి వాదన వినకుండానే ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి నోటీసులు అందుకున్న కొందరు అసలు ఈ కేసులో ప్రతివాదులుగా కూడా లేరని తెలిసింది.