న్యూఢిల్లీ: రక్షణ శాఖకు బడ్జెట్ కేటాయింపులు కాస్త పెరిగాయి. 2023-24లో రక్షణ వ్యయాలు 12.95 శాతం పెరుగనున్నాయి. గత బడ్జెట్లో రూ.5.25 లక్షల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. కొత్త ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, ట్యాంకులు కొనుగోలుకు, అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి డిఫెన్స్ బడ్జెట్‌ను ఈ మేరకు పెంచినట్లు వెల్లడించారు.
కాగా, సాయుధ దళాల ఆధునీకరణ బడ్జెట్ కూడా 6.5 శాతం మేర పెరిగింది. గత ఏడాది రూ.1.52 లక్షల కోట్లు ఉండగా దీనిని ఈసారి రూ.1.62 లక్షల కోట్లకు పెంచారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ తయారీదారుల నుంచి ఆయుధ వ్యవస్థలు, పరికరాలను కొనుగోలు చేసేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.
మరోవైపు కొత్త జనరేషన్ 4.5 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం యోచిస్తున్నది. అలాగే దేశీయంగా యుద్ధ విమానాల తయారీలో పెట్టుబడులకు కేంద్రం నిధులు కేటాయించనున్నది. ఆధునాతన సబ్మెరైన్లను నేవీ సమకూర్చుకోనున్నది. అలాగే ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలుపై దృష్టిసారించింది. అయితే ఈ ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఇక తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్‌ను ఆర్మీ కొనుగోలు చేయనున్నది. లడఖ్‌లో ఆపరేషన్స్ కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.