Defence Minister : 2014కు ముందు బలహీనంగా ఉన్న ఐదు ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు అద్భుత ఐదు ఎకానమీల్లో ఒకటిగా ఎదిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. తిరువనంతపురంలో శుక్రవారం మనోరమ న్యూస్ కాంక్లేవ్ 2024 సదస్సులో ఆయన మాట్లాడారు.
భారత ఆర్ధిక వ్యవస్ధ అసాధారణ మార్పులకు వేదికగా నిలిచిందని అన్నారు. దేశంలో సులభతర వాణిజ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ చొరవతో గతంలో పర్యావరణ క్లియరెన్స్ రావాలంటే 600 రోజులు పట్టగా ఇప్పుడది కేవలం 75 రోజుల్లోనే సాధ్యమవుతున్నదని చెప్పారు. దేశంలో సులభతర వాణిజ్య ప్రక్రియ బహుముఖంగా మెరుగైందని తెలిపారు. 5జీ ప్రవేశపెట్టడంలో దేశ పురోగతిని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ దేశంలో 5జీ పురోగతిని టెలికాం కంపెనీ ఎరిక్సన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రశంసించారని చెప్పారు.
పలు ఐరోపా దేశాల కంటే ఈ విషయంలో భారత్ ముందున్నదని తెలిపారని వివరించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత ఆర్ధిక వ్యవస్ధ మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని, ఇప్పుడు భారత్ దేశంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉందని, 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీలో రెండో స్ధానంలో ఉందని వెల్లడించారు.
Read More :
Spice Jet | ఆర్థిక కష్టాల్లో స్పైస్ జెట్.. సిబ్బందికి మూడు నెలలు జీతం కట్