M Tech | న్యూఢిల్లీ: మన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు నిదానంగా పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితికి కారణాలను పరిశీలిస్తే, ఎంటెక్‌లో ప్రాక్టికల్, అప్లికేషన్ బేస్డ్ స్కిల్స్‌పై కన్నా పరిశోధన ఆధారిత అంశాలపైనే దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలు బీటెక్ గ్రాడ్యుయేట్లకే ప్రాధాన్యమిస్తున్నాయి.
బీటెక్ చదివినవారిని తీసుకుంటే, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారిని తీసుకున్నపుడు భరించాల్సిన అదనపు ఖర్చులు చెల్లించనక్కర్లేదని భావిస్తున్నాయి. మరోవైపు ఎంటెక్ వల్ల అదనంగా లభించే ఆర్థిక ప్రయోజనాలేవీ లేనందువల్ల విద్యార్థులు కూడా అటువైపు దృష్టి సారించడం లేదు. పీహెచ్డీ చేయాలంటే ఎంటెక్ అవసరం లేకపోవడం కూడా ఎంటెక్‌లో చేరికలు తగ్గడానికి మరొక కారణం. ఈ నేపథ్యంలో ఎంటెక్ కోర్సులను అత్యవసరంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయి. ఏడేండ్ల క్రితం ఎంటెక్ కోర్సుల్లో 68,677 మంది చేరగా, గడచిన రెండు విద్యా సంవత్సరాల్లో సంవత్సరానికి దాదాపు 45 వేల మంది మాత్రమే చేరారు. మొత్తం పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు 2017-18లో 1.85 లక్షలు కాగా, 2023-24లో 1.24 లక్షలకు తగ్గింది. కానీ ఖాళీ సీట్ల సంఖ్య 63 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. దీనిని బట్టి, ఎంటెక్ డిగ్రీకి ఉన్నట్లు చెప్పుకునే గొప్ప విలువకు, వాస్తవంగా దానివల్ల లభించే కెరీర్ అవకాశాలు, జీతాలు వంటి ప్రయోజనాలకు మధ్య ఎంత తీవ్రమైన అంతరం ఉందో స్పష్టమవుతుంది.
బీటెక్ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. 2017-18లో 14.75 లక్షల సీట్లలో దాదాపు సగం, అంటే, 7.25 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, 2023-24లో మొత్తం బీటెక్ సీట్లు 13.49 లక్షలు కాగా, కేవలం 17 శాతం, అంటే, 2.28 లక్షల సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. బీటెక్ ఎన్రోల్మెంట్ 2022-23లో 10.36 లక్షల నుంచి 2023-24లో 11.21 లక్షలకు పెరిగింది. ఈ పరిణామాలపై ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, బీటెక్ చేసినవారికి వచ్చే జీతాలతో పోల్చినపుడు ఎంటెక్ పూర్తయిన తర్వాత వచ్చే జీతాల్లో పెద్దగా మార్పులు ఉండటం లేదన్నారు.
అందుకే విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్వైపు మొగ్గు చూపడం లేదన్నారు. బోధన పట్ల ఆసక్తి గలవారు మాత్రమే ఎంటెక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఎస్ఎస్ మంథా మాట్లాడుతూ, సమకాలిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను ఇచ్చే బీటెక్పైనే పరిశ్రమలు దృష్టి పెడుతున్నాయని, పీజీ విద్యలో అదనపు విలువలు పారిశ్రామిక రంగానికి కనిపించడం లేదని చెప్పారు.
అవసరమైన పనిని బీటెక్ చదివినవారి చేత చేయించుకోగలిగినపుడు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారిని ఎందుకు నియమించుకోవాలి? ఎక్కువ జీతం ఎందుకు ఇవ్వాలి? అని పరిశ్రమలు ఆలోచిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల్లో ప్రస్తుతం జరుగుతున్నదానికి అనుగుణంగా ఎంటెక్ పాఠ్యాంశాలను ఆధునికీకరించడం లేదన్నారు. మరోవైపు అండర్గ్రాడ్యుయేట్లు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో మేనేజ్మెంట్ను తీసుకుంటున్నారని తెలిపారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశాల్లో మార్పులు జరుగుతున్నాయన్నారు.
ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ వీ రామగోపాల రావు మాట్లాడుతూ, టైర్-1 విద్యా సంస్థల్లో ఎంటెక్ సీట్లు భర్తీ అవుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేసరికి విద్యార్థులు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రైవేట్ రంగంలో అత్యధిక జీతాలను ఆశించేవారు ఎంటెక్ కోర్సుల్లో కొనసాగుతున్నారన్నారు. టైర్-2, టైర్-3 విద్యా సంస్థల్లో ఎంటెక్ సీట్లు భర్తీ కావడం కష్టమేనని, ఎంటెక్ డిగ్రీ వల్ల అదనంగా వచ్చే విలువ ఏమీ ఉండకపోవడమే దీనికి కారణమని తెలిపారు. టైర్-2, టైర్-3 విద్యా సంస్థల్లో ఎంటెక్ కోర్సులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా లేవన్నారు. మాస్టర్స్ లెవెల్లో బోధించే ఫ్యాకల్టీ దొరకడం అంత సులభం కాదని చెప్పారు.