చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మళ్లీ సమరశంఖం పూరించారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడంపై కన్నెర్ర చేశారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు డిసెంబర్ 6న ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా సోమవారం ప్రకటించాయి. గతంలో ఢిల్లీ చలో మార్చ్‌ను భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఫిబ్రవరి 13 నుంచి రైతు సంఘాలు శంభు, ఖనౌరీ సరిహద్దు వద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘మాకు ఇంకో మార్గం లేదు. మేం తొమ్మిది నెలల పాటు శాంతియుతంగా ప్రభుత్వ స్పందన కోసం వేచి చూశాం. కానీ ఇప్పుడు ఢిల్లీ దిశగా వెళతాం’ అని కేఎంఎం నాయకుడు సర్వణ్ సింగ్ పంధేర్ తెలిపారు. ఎస్కేఎం నేత గురమ్నీత్ సింగ్ మంగత్ మాట్లాడుతూ రైతులు మార్చ్ చేయాలనుకుంటున్న రోడ్డులో భారీగా బారికేడ్లు ఉంచారని తెలిపారు. ఈ నెల 26 తర్వాత పంజాబ్ బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపిస్తామని రైతు నాయకులు చెప్పారు.