లక్నో: న్యాయ విద్య చదువుతున్న వారికి మనుస్మృతి బోధించాలని వచ్చిన ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. ఢిల్లీ వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి(Mayawati) స్వాగతించారు. న్యాయ విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని వచ్చిన సలహాలను తిరస్కరించినట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేశ్ సింగ్ తెలిపారు. మనుస్మృతి బోధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని, మను చట్టాలను బోధించేందుకు వర్సిటీ అయిష్టతను వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. అందరూ ఆమోదించే భారత రాజ్యాంగాన్ని పరమ పూజ్యులు బాబా సాహెబ్ అంబేద్కర్ రాశారని, నిర్లక్ష్యానికి గురైన మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజ్యాంగాన్ని రాశారని, ఇది మనుస్మృతికి ఏ మాత్రం తీసిపోదని, అందుకే ఆ స్మృతులను బోధించడం సరికాదు అని యూపీ మాజీ సీఎం మాయా పేర్కొన్నారు.
న్యాయ విద్యార్థుల సెలబస్‌లో మార్పులు చేయాలని, ఫస్ట్, థార్డ్ ఇయర్ విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని లా ఫ్యాకల్టీ నిర్ణయం తీసుకున్నది. అయితే దీనిపై ఢిల్లీ వర్సిటీ నుంచి అనుమతి కోసం ఆ ఫ్యాకల్టీ ఎదురుచూసింది. రెండు వర్షన్స్‌కు చెందిన మనుస్మృతిని విద్యార్థులకు పరిచయం చేయాలని భావించారు. జీఎన్ జా రాసిన మనుభ్యాస ఆఫ్ మేధతితి, టీ కృష్ణస్వామి అయ్యర్ రాసిన మనుస్మృతి-స్మృతిచంద్రికను విద్యార్థులకు ఇంట్రడ్యూస్ చేయాలని ప్రతిపాదించారు. జూన్ 24వ తేదీన డీన్ అంజూ వాలీ టిక్కూ నేతృత్వంలో జరిగిన భేటీలో ఆ ప్రతిపాదనలకు అంగీకరించారు. అయితే మనుస్మృతి ప్రగతిశీల విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుందని, మహిళలు-అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఉందని వామపక్ష ఎస్డీటీఎఫ్ ఢిల్లీ వర్సిటీకి లేఖ రాసింది.