Rahul Gandhi | పరువు నష్టం కేసులో సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సెషన్స్ కోర్టు తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ కేసులో రాహుల్‌తో పాటు బీజేపీకి చెందిన పూర్ణేష్ మోదీ వాదనలను విన్న కోర్టు.. ఈ నెల 20న తీర్పు వెలువరించనున్నది. గత నాలుగేళ్ల కింద కర్ణాటక కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు.
కాంగ్రెస్ నేత తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ చీమా వాదనలు వినిపించారు. రాహుల్ వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారని, తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడం పెద్ద నష్టమని తెలిపారు. రాహుల్ ప్రసంగం పరువు నష్టం కలిగేలా లేదని, దాన్ని అలా చిత్రీకరించారని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రధానిపై బహిరంగంగ వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు వాదించారు. ‘పంజాబీలు గొడవలు చేస్తారని ఎవరైనా చెబితే.. దానిపై పరువు నష్టం కేసు పెట్టొచ్చా’ అని ప్రశ్నించారు. సందర్భాన్ని బట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, మోదీ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులను అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశం ఉందా? లేదా? నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పూర్ణేశ్ మోదీకి తెలిసిందన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఎవరి పరువుకు భంగం కలిగేలా లేవని, కేవలం భూతద్దంలో చూపిస్తూ కేసు వేశారని ఆరోపించారు. గుజరాత్ జనాభా మొత్తం ఆరుకోట్లని, మోదీ ఇంటిపేరుతో 13కోట్ల మంది ఉన్నారంటూ పిటిషనర్ లాజిక్‌ను న్యాయవాది చీమా ప్రశ్నించారు. ఈ వ్యాజ్యం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం వల్ల వచ్చిన ఫలితం తప్ప మరొకటి కాదన్నారు. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఎదుట ఉంచిన సాక్ష్యాలపై సైతం రాహుల్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం ప్రసంగాన్ని రికార్డు చేయలేదని, చట్టం మేరకు ఏదైనా రికార్డు చేయాలనుకుంటే ప్రసంగం మూలాన్ని కూడా తీసుకురావాలన్నారు.
కానీ, ఈ సందర్భంలో మొత్తం ప్రసంగాన్ని రికార్డు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఏప్రిల్ 13న కోలార్‌లో రాహుల్ ప్రసంగించారని, ఏప్రిల్ 14న వార్త పత్రికల్లో కథనం ప్రచురితమైందని, 15న ఫిర్యాదు దాఖలైందన్నారు. 16న వాంగ్మూలాలను నమోదు చేశారని.. ఆ తర్వాత విచారణ వరకు ఇతర ఆధారాలు లేమీ నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కోలార్‌లో జరిగిన కేసును విచారించడంపై సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు అధికార పరిధిని సైతం రాహుల్ న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. మరో వైపు పూర్ణేశ్ మోదీ తరఫున సైతం కోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వు చేసింది.