న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : కృత్రిమ మేధ(ఏఐ) వాడకం కస్టమర్ సర్వీసు నుంచి నిర్ణయం తీసుకునే సాధనం వరకు రోజురోజుకూ పెరిగిపోతోంది. అత్యంత సమర్థంగా, వినూత్నంగా ఏఐ పనిచేయగలదని భావిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా మోసం చేసే అవకాశంతోపాటు ఏఐతో అనేక బయటకు కనపడని ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక ఏఐ నమూనాలు తమ అసలు ఉద్దేశాలను దాచిపెట్టడం, యూజర్లను తప్పుదారి పట్టించడం, తన సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం వంటి చర్యలకు పాల్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఏఐ నమూనాలకు మోసం చేసే సామర్థ్యం కలిగి ఉండడంతోపాటు తమ అసలు ఉద్దేశాలను దాచిపెట్టి స్వీయ ప్రయోజనాలను రుద్దగలవని ఏఐ భద్రతా గ్రూపు అపోలో రిసెర్చ్తో కలసి పనిచేస్తున్న ఓపెన్ ఏఐ ఒక బ్లాగ్లో ఇటీవల వెల్లడించింది.
ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తున్నప్పటికీ ఏఐ సిస్టమ్స్ ఊహంచని రీతిలో ముప్పును తీసుకురావచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మానవ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటున్నట్లు నటిస్తూనే ఏఐ రహస్యంగా ప్రత్యామ్నాయ అజెండాలను కొనసాగిస్తూ రహస్య పన్నాగాలకు పాల్పడవచ్చని ఓపెన్ ఏఐ తెలిపింది. పరీక్షలలో కావాలనే సరిగా సమాధానాలు చెప్పకపోవడం, అంతర్గత నిబంధనలను గోప్యంగా ఉల్లంఘించడం వంటివి ఇందుకు ఉదాహరణగా ఓపెన్ ఏఐ వివరించింది. ప్రస్తుత ఏఐ నమూనాలకు తీవ్రమైన హాని కలిగించే సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ అప్పగించిన లక్ష్యాన్ని పూర్తిచేయడంలో స్వతంత్రంగా వ్యవహరించడం వంటి చిన్న తరహా మోసాలకు పాల్పడవచ్చని ఓపెన్ ఏఐ తెలిపింది.