(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది. దేశంలోని ఒక్కో పౌరుడి నెత్తిపై ఇప్పుడు రూ. 4.8 లక్షల అప్పు ఉన్నది. అంతేకాదు గడిచిన రెండేండ్ల వ్యవధిలోనే ఈ అప్పు రూ. 90 వేల మేర పెరిగింది. ఈ విషయం ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్-2025’ పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తున్నది.
2025 మార్చి నాటికి దేశంలోని పౌరుల తలసరి అప్పు రూ. 4.8 లక్షలుగా ఉన్నట్టు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. 2023 మార్చిలో ఇది రూ. 3.9 లక్షలుగా ఉండగా.. రెండేండ్ల వ్యవధిలోనే రూ. 90 వేల మేర పెరిగినట్టు వివరించింది. ప్రస్తుత ధరలను బట్టి దేశ జీడీపీలో అప్పుల వాటా 41.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. అప్పుల్లో గృహ రుణాలది 29 శాతం వాటా కాగా.. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, మొబైల్ ఈఎంఐలది 54.9 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది.
స్థిరాస్తి తదితర ఆస్తులను తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాలను లోన్ టూ వ్యాల్యూ (ఎల్టీవీ)గా పిలుస్తారు. ఎల్టీవీ రేషియో ఎప్పుడూ తక్కువగానే ఉండాలి. అప్పుడే రుణాల రికవరీ సులభం అవుతుంది. అయితే రుణాల విషయంలో ఎల్టీవీ రేషియో ప్రస్తుతం 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితం కానటువంటి రిటైల్ లోన్లు కూడా 25 శాతం చేరినట్టు తెలిపింది.
దేశంలోని ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం రూ. 2.16 లక్షలుగా ఉన్నట్టు ఫోర్బ్స్ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం.. ఒక్కో పౌరుడి నెత్తిపై రూ. 4.8 లక్షల అప్పు ఉన్నది. దీన్ని బట్టి వచ్చే సంపాదన కంటే పౌరుల అప్పు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతున్నది. దేశంలో పౌరులు తీసుకొంటున్న రుణాల్లో 55 శాతం అప్పులు భవిష్యత్తులో ఆస్తులను సృష్టించేవిగా లేవని, కేవలం జీవన అవసరాలను తీర్చడం కోసమే ఈ అప్పులు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇందులో పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల వాడకం ప్రధానమైనవిగా వివరించింది. అంటే చేసిన అప్పులను తీర్చడానికి ప్రజలు మళ్లీ కొత్త అప్పులు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఈ ధోరణి పెరుగుతూపోవడం వల్లే పేద, మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారడం, విద్య, వైద్య ఖర్చులు పెరిగిపోతుండటం, నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు లభించకపోవడం, చాలీచాలని జీతం, ద్రవ్యోల్బణానికి తగినట్టు వేతన పెంపు లేకపోవడం వెరసి సామాన్యులు అప్పుల పాలవుతున్నట్టు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని విమర్శిస్తున్నారు. మోదీ 11 ఏండ్ల పాలనలో నిత్యావసరాల ధరలు 300 శాతం మేర పెరగడాన్ని, ఉపాధి కల్పన అధఃపాతాళానికి పడిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
గడిచిన పదకొండేండ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. అచ్చేదిన్ పేరిట దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించి ప్రజలను అప్పుపాల్జేశారని నిప్పులు చెరిగారు. రెండేండ్ల వ్యవధిలో ప్రజల తలసరి అప్పు రూ. 90 వేలు పెరిగిందని ఆర్బీఐ నివేదిక కుండబద్దలు కొట్టడమే దీనికి సాక్ష్యంగా చెప్పారు. ఒకవైపు ప్రజలు అప్పులపాలవుతుంటే, మోదీ మిత్రులు మాత్రం మరింత సంపన్నులుగా మారుతున్నారని దుయ్యబట్టారు.