Boat accident : ముంబై (Mumbai) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం (Boat accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు. మరణించిన 13 మందిలో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ అధికారులు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ముంబై సమీపంలోని బుచర్ ఐలాండ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నేవీకి చెందిన ఓ స్పీడ్ బోట్ అదుపుతప్పి నీల్కమల్ ప్యాసింజర్ వెజెల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పడవ గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ (Indian coast guards), నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 101 మందిని రక్షించారు. మిగతా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం 11 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4 హెలిక్యాప్టర్లను వినియోగించినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
రాత్రి 7.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యిందని ఫడ్నవీస్ చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం రేపు ఉదయంకల్లా అందుతుందని అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై పోలీసులు, నేవీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.