వయనాడ్, ఆగస్టు 1: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 296కు చేరింది. చలియార్ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికీ 240 మంది ఆచూకీ కనిపించడం లేదు. 200 మంది గాయపడి వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వెయ్యి మందిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం 82 సహాయక శిబిరాలను ఏర్పాటుచేయగా 8,204 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో గురువారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు.
31 గంటల్లో వంతెన నిర్మాణం
కొండచరియలు విరిగిపడ్డప్పుడు చూరల్మల, ముండక్కై మధ్య ఉన్న వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో ఆర్మీలోని మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ బృందానికి చెందిన 140 మంది ఇక్కడకు చేరుకొని కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 31 గంటల పాటు శ్రమించి 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ముండక్కైలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.
పోస్ట్‌మార్టమ్ చేయలేక పారిపోవాలని అనుకున్నా : వైద్యురాలి భావోద్వేగం
మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ చేస్తున్న ఓ మహిళా వైద్యురాలి ఆవేదన ఇక్కడి దయనీయ పరిస్థితులను అద్దం పడుతోంది. ‘మృతుల శరీరాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయి. ఏడాది చిన్నారి మృతదేహాన్ని చూడలేకపోయా. పోస్టుమార్టమ్ చేయలేక బాధితుల సహాయక శిబిరానికిపారిపోవాలనుకున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.